ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ మైనింగ్ జరగలేదని నిరూపించాలి: నక్కా ఆనంద్ బాబు

31-07-2021 Sat 15:21
  • మైనింగ్ అంశంలో టీడీపీ వర్సెస్ వైసీపీ
  • అక్రమ మైనింగ్ జరుగుతోందంటున్న టీడీపీ
  • విపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం
  • ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు
Nakka Anand Babu challenges AP Govt on Kondapally mining

కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ నేపథ్యంలో విపక్ష టీడీపీ, అధికార వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కొండపల్లిలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, అందుకే టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే అక్రమ మైనింగ్ జరగలేదని నిరూపించాలని సవాల్ విసిరారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని నక్కా విమర్శించారు.

అటు, మరో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ధ్వజమెత్తారు. టీడీపీలో ఒక సామాజిక వర్గంపై వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దేవినేని ఉమ ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ ను రాత్రికి రాత్రే బదిలీ చేశారని పేర్కొన్నారు. నాడు పరిటాల రవి హత్య కేసు నిందితులను జైల్లోనే హత్య చేయించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ సొంత జాగీరులా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహం నుంచి జగన్ తప్పించుకోలేరని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.