దేవినేని ఉమ స్వాతంత్ర్య పోరాటం చేశాడని పలకరించడానికి వచ్చారా?: చంద్రబాబుపై వసంత కృష్ణప్రసాద్ విసుర్లు

31-07-2021 Sat 15:01
  • గొల్లపూడి వచ్చిన చంద్రబాబు
  • ఉమా కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ
  • విద్వేషాలు రగల్చడానికే చంద్రబాబు వచ్చారన్న వసంత
  • చంద్రబాబుకు ఏం తెలుసని ప్రశ్నించిన వైనం
YCP MLA Vasantha Krishna Prasad comments in Chandrababu

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గొల్లపూడి రావడంపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శలు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపూడి వచ్చారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే ఆయన పర్యటిస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమ ఏమైనా స్వాతంత్ర్య సమర యోధుడని పలకరించడానికి వచ్చారా? అని వ్యంగ్యంగా అన్నారు. దేవినేని ఉమ చెప్పిన అవాస్తవాలను నిజం చేయడానికే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేశారని కృష్ణప్రసాద్ ఆరోపించారు.

అసలు, మైలవరంలో జరుగుతున్న అంశాలపైనా, కొండపల్లి అటవీప్రాంతం గురించి చంద్రబాబుకు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉమా తప్పు చేసిన విషయం చంద్రబాబుకు కూడా తెలుసని, ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా సీఎం జగన్ పై ఉమా చేస్తున్న దుష్ప్రచారంతో విసిగిపోయిన ప్రజలు తిరగబడ్డారని వసంత కృష్ణప్రసాద్ వివరించారు.