బీసీసీఐ బెదిరిస్తోంది: దక్షిణాఫ్రికా మాజీ స్టార్​ క్రికెటర్​ గిబ్స్​ సంచలన వ్యాఖ్యలు

31-07-2021 Sat 14:29
  • ‘కశ్మీర్’ ప్రీమియర్ లీగ్ లో బరిలోకి
  • ఆడనివ్వకుండా బీసీసీఐ ఒత్తిడి తెస్తోందన్న గిబ్స్
  • భారత్ లోకి రానివ్వమంటూ బెదిరిస్తోందని కామెంట్
Hershelle Gibbs Sensational Comments On BCCI

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హెర్షలీ గిబ్స్ సంచలన ఆరోపణలు చేశాడు. తనపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పాడు. ట్విట్టర్ లో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘‘పాకిస్థాన్ తో ఉన్న రాజకీయ సమస్యలను బీసీసీఐ అనవసరంగా ఇందులోకి లాగి రాద్ధాంతం చేస్తోంది. కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్ 20) నేను ఆడకుండా ఒత్తిడి తెస్తోంది. అందులో ఆడితే భారత్ లో జరిగే ఎలాంటి క్రికెట్ పోటీలకైనా అనుమతివ్వబోమని బెదిరిస్తోంది. ఇది అత్యంత మూర్ఖమైన చర్య’’ అని ట్విట్టర్ లో గిబ్స్ పేర్కొన్నాడు.

కాగా, పాక్ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు. కేపీఎల్ లో ప్లేయర్లెవరూ ఆడకుండా వివిధ దేశాల క్రికెట్ బోర్డులను బీసీసీఐ బెదిరిస్తోందన్నాడు. భారత్ లోకి రాకుండా చేస్తామంటూ హెచ్చరిస్తోందని చెప్పాడు. గిబ్స్ తో పాటు దిల్షాన్, మాంటీ పనేసర్ తదితరులను ఇప్పటికే బెదిరించిందన్నాడు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), కశ్మీర్ కు సంబంధించి పాకిస్థాన్ తో వివాదాలున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పాకిస్థాన్ పీవోకేలోని కొందరు క్రీడాకారులతో ‘కశ్మీర్’ పేరిట ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తూ కయ్యానికి కాలు దువ్వింది.

ఆరు టీమ్ లతో కేపీఎల్ ను పాక్ నిర్వహించనుంది. ఓవర్సీస్ వారియర్స్, ముజఫరాబాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాఘ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లి లయన్స్ అనే టీమ్ లు లీగ్ లో ఉన్నాయి. షెహర్యార్ ఖాన్ అఫ్రీది అనే పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఈ లీగ్ ను నిర్వహిస్తున్నాడు. ప్రతి టీమ్ లో పీవోకే నుంచి ఐదుగురు క్రీడాకారులకు అవకాశం ఇచ్చేలా టోర్నీ నిర్వహించనున్నాడు.