COVID19: భారత్​ లో స్పుత్నిక్​ వీ సెకండ్​ డోసు తయారీ కష్టమే.. దాని డిజైనే వేరంటున్న నిపుణులు!

  • ‘ఏడీ 5’కు అవసరమైన వైరస్ ఉత్పత్తి తక్కువ
  • దాంతో వ్యాక్సిన్ డోసుల సంఖ్య కూడా తక్కువే
  • సాంకేతిక సమస్యలపై రష్యా నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు
  • నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నారన్న అధికారులు
Road Blocks For Sputnik V Second Dose Manufacturing In India

ప్రపంచంలోనే మొట్టమొదటిగా మార్కెట్ లోకి విడుదలైన వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ. అడినోవైరస్ వెక్టర్ సాంకేతికతతో రష్యా గమేలియా ఇనిస్టిట్యూట్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఏడీ 26, ఏడీ 5 అనే రెండు డోసులుగా జనానికి అందిస్తోంది. భారత్ లో ఆ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రష్యాతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం చేసుకుంది.

ఒప్పందంలో భాగంగా కొన్ని నెలల క్రితం 31.5 లక్షల డోసులు భారత్ కు దిగుమతి అయ్యాయి. దాంతో పాటు వ్యాక్సిన్ ను ఇక్కడ కూడా ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు జరిగాయి. మొదటి డోసు ఏడీ 26 తయారీలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. రెండో డోసు ఏడీ 5తోనే చిక్కులు వచ్చిపడుతున్నాయట. భారత్ లో దాని తయారీ కష్టమేనని అంటున్నారు.

ఏడీ 5 ఉత్పత్తిలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, అసలు దాని డిజైనే మిగతా వాటికి పూర్తి భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఇటీవలే రష్యా నుంచి శాస్త్రవేత్తలూ వచ్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఏడీ 5 తయారీకి ఎక్కువ సమయం తీసుకుంటోందని, వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే వైరస్ ను కల్చర్ ద్వారా అతి తక్కువ మొత్తంలోనే ఉత్పత్తి చేయగలుగుతున్నామని వారు చెబుతున్నారు.

కల్చర్ లో వైరస్ ఉత్పత్తి తగ్గితే.. వ్యాక్సిన్ డోసుల సంఖ్య కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వాస్తవానికి ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 10 కోట్ల స్పుత్నిక్ వీ టీకా డోసులు అందుతాయని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. అయితే, రెండో డోసు ఉత్పత్తి నెమ్మదిస్తే.. డిసెంబర్ నాటికి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా వేయాలన్న లక్ష్యాన్ని చేరడం కష్టమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,44,638 డోసుల స్పుత్నిక్ వీ టీకాను ఇచ్చారు.

కాగా, సమస్యపై డాక్టర్ రెడ్డీస్ స్పందించింది. ప్రస్తుతం రష్యా నుంచి 4.5 లక్షల డోసుల స్పుత్నిక్ వీ ఏడీ 5ను దిగుమతి చేసుకున్నామని చెప్పింది. సరఫరాను పెంచేందుకు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. అంతేగాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు దేశంలో ఒప్పందం చేసుకున్న 6 సంస్థలతోనూ కృషి చేస్తున్నామని వివరించింది. ప్రస్తుతం దేశంలోని 80 నగరాల్లో 2.5 లక్షల మందికి స్పుత్నిక్ టీకాలు ఇచ్చామని తెలిపింది.

More Telugu News