పారితోషికం పెంచేసిన కృతి శెట్టి!

31-07-2021 Sat 12:18
  • 'ఉప్పెన'తో దక్కిన భారీ హిట్
  • నానీతో సినిమా పూర్తి
  • షూటింగు దశలో రెండు సినిమాలు
  • లైన్ల్ మరో రెండు ప్రాజెక్టులు  
Kruthi Shetty upcoming movies

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి ఒకరు. తొలి సినిమా 'ఉప్పెన'తోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతే కాదు చకచకా ఆఫర్లు వచ్చేశాయి. అయినా ఆమె తొందరపడకుండా తనకి నచ్చిన ప్రాజెక్టులకు మాత్రమే ఓకే చెబుతూ వెళుతోంది.

నాని కథానాయకుడిగా 'శ్యామ్ సింగ రాయ్' చేసిన ఆమె, ప్రస్తుతం సుధీర్ బాబు జోడీగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో చేస్తోంది. అలాగే రామ్ సరసన లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 'బంగార్రాజు' సినిమాకి సంబంధించి కూడా కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య జోడీగా అలరించనుందని అంటున్నారు.

ఇక తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. నూతన దర్శకుడు ఎస్.ఆర్.శేఖర్ తో నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ  సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారని అంటున్నారు. మొదటి మూడు సినిమాలకు పారితోషికంగా 60 లక్షలు మాత్రమే తీసుకున్న కృతి శెట్టి, రామ్ సినిమా నుంచి 75 లక్షలు డిమాండ్ చేస్తోందని అంటున్నారు. అయినా ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తుండటం విశేషం.