Chandrababu: ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? డీజీపీ ఏం చేస్తున్నారు?: చంద్రబాబు ఫైర్

Shame on this Chief Minister says Chandrababu
  • కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోంది
  • దేవినేని ఉమపై అక్రమ కేసులు పెట్టారు
  • ఏపీ పోలీసులు చేతులారా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు
మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే విషయం అందరికీ తెలిసిందేనని... గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ ట్రైబ్యునల్ కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందని స్పష్టం చేసిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లి వస్తున్న దేవినేని ఉమపై వైసీపీ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. దాదాపు 9 గంటల పాటు ఉమ కారులోనే ఉన్నారని... అలాంటి వ్యక్తి కారులో నుంచే ఇతరులపై ఎలా దాడికి పాల్పడతారని ప్రశ్నించారు. కారులో ఉన్న ఆయన బయటున్న వారిని ఎలా దూషిస్తారని అన్నారు. ఉమపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఈ డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఉమపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే సీనియర్ ఐపీఎస్ అధికారిగా మీరేం చేస్తున్నారని మండిపడ్డారు.
 
దేశంలోనే అత్యున్నత పోలీసులుగా పేరుగాంచిన ఏపీ పోలీసులు... చేతులారా వారికివారే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి అరాచకాలను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది డీజీపీలను చూశానని చెప్పారు. డీజీపీ, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజల్లో ధైర్యం నింపేలా వ్యవహరించాలని అన్నారు. పరిపాలించడం చేతకాని జగన్... రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీ తీసుకొస్తారని తాను ఎప్పుడో చెప్పానని తెలిపారు. ఇలాంటి సీఎంలను తాము ఎందరినో చూశామని... అధికారం శాశ్వతం కాదని, ఎవరైనా ఏదో ఒకరోజు అధికారాన్ని కోల్పోవాల్సిందేనని చెప్పారు.
Chandrababu
Telugudesam
Devineni Uma
Jagan
YSRCP
AP DGP

More Telugu News