ఎయిర్ హోస్టెస్ గా కనిపించనున్న అనసూయ!

30-07-2021 Fri 18:46
  • బుల్లితెరపై విపరీతమైన క్రేజ్
  • యూత్ లో మంచి ఫాలోయింగ్
  • జయశంకర్ కథకి గ్రీన్ సిగ్నల్
  • వచ్చేనెలలో సెట్స్ పైకి
Anasuya is seen as Air Hostess

అనసూయ ఒక వైపున బుల్లితెర షోలు చేస్తూనే, మరో వైపున సినిమాలు చేస్తూ వెళుతోంది. సినిమాల పరంగా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించడానికీ, స్పెషల్ సాంగ్స్ లో మెరవడానికి ప్రాధాన్యతను ఇస్తూ వెళ్లింది. ఇక ఈ మధ్య మాత్రం ముఖ్యమైన పాత్రలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. ఇటీవల ఆమె ఒప్పుకున్న సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ప్రస్తుతం అనసూయ 'పుష్ప' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. 'రంగమ్మత్త' స్థాయిలో ఈ పాత్ర కూడా తనకి మంచి గుర్తింపును తీసుకొస్తుందని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో సినిమా చేయడానికి అంగీకరించిందనే విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఆమె 'ఎయిర్ హోస్టెస్'గా కనిపించనుందని అంటున్నారు.

గతంలో 'పేపర్ బాయ్' సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్, కొత్తగా ఒక కథను తయారు చేసున్నాడు. ఈ కథలో 6 ప్రధానమైన పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల నేపథ్యం .. వాటి నడక .. కలయిక చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అందులో ఎయిర్ హోస్టెస్ గా అనసూయ కనిపిస్తుందన్న మాట. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకోగా, వచ్చేనెల నుంచి అనసూయ జాయిన్ కానుందని చెబుతున్నారు.