ఆసక్తిని రేకెత్తిస్తున్న 'నేత్రికన్' ట్రైలర్!

30-07-2021 Fri 17:16
  • క్రైమ్ర్ థ్రిల్లర్ గా 'నేత్రికన్'
  • వచ్చేనెల 13న హాట్ స్టార్ లో
  • అంధురాలిగా నయనతార
  • కీలక పాత్రలో అజ్మల్
Netrikan trailer released

నయనతార తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'నేత్రికన్' సిద్ధమవుతోంది. వచ్చేనెల 13వ తేదీన 'డిస్నీ హాట్ స్టార్' ద్వారా విడుదలవుతోంది. నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అనుక్షణం ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో నయనతార అంధురాలి పాత్రలో నటించింది. ఒక సీరియల్ కిల్లర్ నయనతారను టార్గెట్ చేస్తాడు. అందుకు కారణం ఏమిటి? ఆయన బారి నుంచి ఆమె ఎలా తప్పించుకుంటుంది? అనే మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. ఆ విషయాలను హైలైట్ చేస్తూనే ఈ ట్రైలర్ సాగింది.

విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ సినిమాకి మిలింద్ రావ్ దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన 'అవల్' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అజ్మల్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.