ఢిల్లీకి వరద ముప్పు... ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న యమున

30-07-2021 Fri 17:16
  • యమునా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు
  • దిగువకు నీరు విడుదల చేస్తున్న హర్యానా
  • ఢిల్లీ వద్ద పోటెత్తుతున్న యమున
  • అప్రమత్తమైన ఢిల్లీ అధికార యంత్రాంగం
Yamuna river crosses danger mark as Delhi got flood alert

దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు వరద ముప్పు పొంచి ఉంది. యుమున నది పొంగిపొర్లుతుండడమే అందుకు కారణం. ఎగువ పరీవాహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు, హర్యానా రాష్ట్రం హతినికుండ్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండడంతో ఢిల్లీ వద్ద యమున నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ వద్ద యమున నది నీటి మట్టం 205.33 మీటర్లు దాటింది. దాంతో ఢిల్లీ అధికార యంత్రాంగం వరద హెచ్చరిక జారీ చేసింది.

యుమున నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యమున నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు బోట్లను అందుబాటులో ఉంచారు.