టోక్యో ఒలింపిక్స్ లో జకోవిచ్ కు ఓటమి... సెమీస్ లో జ్వెరెవ్ సంచలన విజయం

30-07-2021 Fri 16:21
  • 1-6, 6-3, 6-1తో నెగ్గిన జ్వెరెవ్
  • ఫైనల్లో ఖచనోవ్ తో పోరు
  • జకోవిచ్ గోల్డెన్ స్లామ్ ఆశలకు తెర
  • మూడో స్థానం కోసం పోటీపడనున్న జకో
Noval Djokovic lost to Zverev in Tokyo Olympics semis

టాప్ ర్యాంక్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఆశాభంగం కలిగింది. సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబర్చిన జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 1-6, 6-3, 6-1తో జకోవిచ్ ను చిత్తు చేశాడు. ఒలింపిక్ స్వర్ణం గెలిచి ఈ ఏడాది గోల్డెన్ స్లామ్ (ఓ ఏడాదిలో అన్ని గ్రాండ్ స్లామ్ టోర్నీల టైటిళ్లతో పాటు ఒలింపిక్ స్వర్ణం) నమోదు చేయాలని ఆశించిన జకోవిచ్ కు ఈ పరాజయం తీవ్ర నిరాశ కలిగించింది.

ఈ పోరులో తొలి సెట్ ను గెలిచిన జకోవిచ్ అదే ఊపును కొనసాగించడంలో విఫలమయ్యాడు. రెండో సెట్ లో పుంజుకున్న జర్మనీ ఆటగాడు జ్వెరెవ్ ఎక్కడా జకోవిచ్ కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు.

మరో సెమీఫైనల్లో రష్యా ఆటగాడు కరెన్ ఖచనోవ్ 6-3, 6-3తో స్పెయిన్ కు చెందిన కరెనో బుస్టాపై నెగ్గాడు. టెన్నిస్ పురుషుల విభాగం సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ జ్వెరెవ్, ఖచనోవ్ మధ్య జరగనుంది. ఇక, సెమీఫైనల్ మ్యాచ్ ల్లో ఓటమిపాలైన జకోవిచ్, బుస్టా కాంస్యం కోసం పోరాడనున్నారు.

కాగా, ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన జకోవిచ్... ఒలింపిక్స్ తో పాటు యూఎస్ ఓపెన్ గెలిస్తే గోల్డెన్ స్లామ్ నమోదు చేయగలిగేవాడు. కానీ, సెమీస్ లో ఓటమి ఆ అవకాశాన్ని దూరం చేసింది. టెన్నిస్ చరిత్రలో జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ ఒక్కతే గోల్డెన్ స్లామ్ నమోదు చేయగలిగింది. స్టెఫీ 1988లో ఈ ఘనత సాధించింది.