సింధు ఒత్తిడిని జయించి ఈ మ్యాచ్ లో విజయం సాధించింది: తండ్రి వెంకటరమణ

30-07-2021 Fri 15:54
  • టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన సింధు
  • క్వార్టర్ ఫైనల్లో జపాన్ షట్లర్ పై విజయం
  • ఇది సమష్టి కృషితో సాధించిన విజయమన్న రమణ
  • కోచ్ సహా అందరి పాత్ర ఉందని వెల్లడి
  • సెమీస్ లోనూ సింధు గెలుస్తుందని ధీమా
PV Ramana reacts on his daughter PV Sindhu winning performance in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడాంశంలో సెమీస్ చేరడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తనకన్నా మెరుగైన సీడింగ్ కలిగిన జపాన్ షట్లర్ అకానే యమగూచిని సింధు ఓడించడం పట్ల ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఒత్తిడిని జయించి విజయం సాధించిందని అన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు చాలా బాగా ఆడిందని పేర్కొన్నారు.

సింధు విజయం సమష్టి కృషికి నిదర్శనమని, కోచ్ సహా అందరి పాత్ర ఉందని వినమ్రంగా తెలిపారు. సింధు దేశానికి మంచిపేరు తెస్తున్నందుకు ఓ తండ్రిగా ఆనందపడుతున్నానని పీవీ రమణ తన మనోభావాలను పంచుకున్నారు. సెమీస్ లో కూడా ఇదే ఆటతీరుతో విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.