నీళ్లూ బంగారమవుతాయ్​.. చేసి చూపించిన శాస్త్రవేత్తలు!

30-07-2021 Fri 14:24
  • రెండు మూలకాలతో నీటి ప్రతిచర్య
  • కొన్ని క్షణాల పాటు బంగారంగా మార్పు
  • ఆ వెంటనే మెరిసే లోహంగా పరివర్తన
  • షరతులున్నాయంటున్న శాస్త్రవేత్తలు
Water Can Be Turned Into Gold Scientists Proved It

చాలా మంది నీటిని ఎక్కువగా వృథా చేస్తుంటారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కొందరు మాత్రం మారట్లేదు. కానీ, ఇదిగో ఈ విషయం తెలిస్తే.. ఒక్క చుక్క కూడా వృథా చేయరేమో! ఎందుకంటే నీటిని బంగారంగా మార్చేసేయొచ్చట. శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా దానిని చేసి చూపించారు. అయితే, దానికంటూ కొన్ని షరతులున్నాయి, పరిమితులున్నాయి. దానికి ‘టైమింగ్’ చాలా కీలకం మరి!

ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. వాస్తవానికి లోహాలు కాని చాలా వస్తువులను లోహాలుగా మార్చొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, దానికి అమితమైన పీడనం అవసరమవుతుందంటున్నారు. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుందని, దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.

నీటి విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్తలు.. నీటిని లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని అన్నారు. అయితే, అంత పీడనం లేకుండానే నీటిని లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ అకాడమీ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను అరువుగా తీసుకుని.. నీటిపై ప్రయోగిస్తే అది సాధ్యమవుతుందని తేల్చారు.

పీరియాడిక్ టేబుల్ (రసాయన పట్టిక)లోని గ్రూప్ 1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు. అయితే, వాటికి నీటి చుక్క తగిలితే మండే స్వభావం ఉంటుంది. దాని వల్ల పేలుళ్లు జరిగే ప్రమాదం ఉంటుంది. దానిని అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య (రియాక్షన్) నిదానంగా సాగేలా చూసుకున్నారు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు.

తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, టైమ్ చాలా కీలకమని అన్నారు.