రేప్ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్న గోవా సీఎం

30-07-2021 Fri 14:21
  • గోవా బీచ్ పార్టీలో అత్యాచారానికి గురైన ఇద్దరు మైనర్ బాలికలు
  • పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్న సీఎం
  • సీఎంపై విరుచుకుపడ్డ విపక్షాలు
Goa CM takes U turn in his rape comments

అర్ధరాత్రి బీచ్ పార్టీకి వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురైన ఘటనకు సంబంధించి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాత్రిపూట పిల్లలు బయటకు వెళ్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిల్లలు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అంతా జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శిస్తే ప్రయోజనం లేదని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రమోద్ సావంత్ యూటర్న్ తీసుకున్నారు.

ఇద్దరు అమ్మాయిలు అత్యాచారానికి గురి కావడం దురదృష్టకరమైన విషయమని చెప్పారు. ఈ అంశంపై తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా, 14 ఏళ్ల కూతురుకి తండ్రిగా ఈ ఘటన పట్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు.