యాపిల్​ వ్యవస్థాపకుడు స్టీవ్​ జాబ్స్​ ‘ఒకే ఒక్క జాబ్​ అప్లికేషన్’​ ఎంత ధర పలికిందో తెలుసా?

30-07-2021 Fri 13:45
  • వేలంలో రూ.2.5 కోట్లకు పాడుకున్న వ్యక్తి
  • భౌతిక, డిజిటల్ వెర్షన్ ల దరఖాస్తు వేలం
  • 1973లో జాబ్ కోసం దరఖాస్తు పెట్టిన జాబ్స్
Steve Jobs One and Only Job Application Sold For A Huge Price

స్టీవ్ జాబ్స్.. సక్సెస్ కు మారుపేరుగా మనకు తెలిసిన వ్యక్తి. యాపిల్ సంస్థను స్థాపించి ప్రపంచంలోనే అత్యంత మన్నికైన, ఖరీదైన బ్రాండ్ గా నిలిపారు. మరి, అంతకుముందు ఆయన జీవితమేంటి? పేరులో జాబ్స్ ఉంది సరే.. ఆయన వేరే కంపెనీల్లో జాబ్ చేశాడా? అంటే.. ఆయన తన జీవితంలో పెట్టుకున్న ఒకే ఒక్క దరఖాస్తును అడిగితే చెబుతుంది.

అవును, 18 ఏళ్ల వయసులో ఆయన ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. యాపిల్ స్థాపనకు మూడేళ్ల ముందు స్వదస్తూరితో 1973లో ఆ అప్లికేషన్ పెట్టుకున్నారు. జాబ్స్ పెట్టుకున్న ఆ ఒకే ఒక్క జాబ్ అప్లికేషన్ ను తాజాగా స్టీవ్ జాబ్స్ స్నేహితులు ఫిజికల్, వెబ్ పేజ్ రూపంలో గత బుధవారం వేలం వేశారు. ఫిజికల్ దరఖాస్తు 3.43 లక్షల డాలర్లకు (సుమారు రూ.2.5 కోట్లు) ఆ అప్లికేషన్ అమ్ముడుపోయింది. అది ఓ చిన్న పేపర్ ముక్కే కావొచ్చు గానీ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన దరఖాస్తు అనేసరికి అంతరేటు పలికింది.


ఆ జాబ్ దరఖాస్తులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, కానీ, ఫోన్ మాత్రం లేదని జాబ్స్ పేర్కొన్నారు. రవాణా సౌకర్యాలు సాధ్యమే కానీ.. కుదరకపోవచ్చంటూ రాశారు. అయితే, ఈ జాబ్ అప్లికేషన్ కు వేలం జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మూడు సార్లు దానిని వేలానికి పెట్టారు. ఆ మూడు సార్లూ దాని ధర పెరుగుతూనే పోయింది. తొలిసారిగా 2017లో న్యూయార్క్ లో వేలం వేశారు. ఈ ఏడాది మార్చిలోనూ లండన్ లో వేలం నిర్వహించగా రూ.1.7 కోట్లు పలికింది. తాజాగా రెండున్నర కోట్లకు పాడాడో వ్యక్తి.