Mary Kom: చివరి నిమిషంలో డ్రెస్​ మార్చుకోవాలన్నారు.. దానర్థం ఏంటి?: మేరీ కోమ్​ సూటి ప్రశ్న

  • జడ్జిల ప్రకటన తర్వాతా నేనే గెలిచాననుకున్నా
  • రిజిజు ట్వీట్ చేసిన తర్వాతే నిజం తెలిసింది
  • జడ్జిల నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశమూ దొరకలేదు
Mary Kom Questions the Decision To Change Rind Dress in the Last Minute

భారత్ కు పతకం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మేరీ కోమ్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయి కోట్లాది గుండెల్ని బరువెక్కించింది. ఆ భారాన్ని తట్టుకోలేక ఆమె కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. తాజాగా ఆమె తన అంతరంగాన్ని ఓ వార్తా చానెల్ తో పంచుకుంది. అంతేకాదు.. చివరి నిమిషంలో తన ‘రింగ్ డ్రెస్’ను మార్చుకోవాలని చెప్పారంటూ ట్వీట్ చేసింది.

 ‘‘రింగ్ డ్రెస్ అంటే ఏంటో ఎవరైనా నాకు చెప్తారా? రింగ్ లోకి వెళ్లే చివరి నిమిషంలో వేరే డ్రెస్ వేసుకోవాల్సిందిగా చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది! ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాకు చెప్తారా?’’ అని పేర్కొంటూ ప్రధాని ఆఫీస్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒలింపిక్స్, ఒలింపిక్స్ మీడియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.


వాస్తవానికి జడ్జిలు ఫలితాలు వెల్లడించాక మేరీ కోమ్ ఆనందంగా కనిపించింది. అయితే, కిరణ్ రిజిజు ట్వీట్ చేసేదాకా కూడా తాను ఓడిపోయానన్న విషయం తెలియదని ఆమె చెప్పింది. గేమ్ లో తానే గెలిచానని అనుకున్నట్టు చెప్పింది. ఆ తర్వాత తాను ఓడిపోయానని కిరణ్ రిజిజు చేసిన ట్వీట్ చూసి తెలిసిందని పేర్కొంది. అది చూసి కంగు తిన్నానంది. ఏం చెప్పాలో.. ఏం చేయాలో కూడా పాలుపోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. జడ్జిలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని ఆమె వాపోయింది.

గేమ్ అంతా అయిపోయి డోపింగ్ టెస్టుకు వెళ్లినప్పుడూ తాను ఓడిపోయినట్టు అనుకోలేదని మేరీ చెప్పింది. తానే గెలిచానని కోచ్ చెప్పే ప్రయత్నం చేశారని, కానీ, దానర్థం ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదని పేర్కొంది. జడ్జిల నిర్ణయంపై కనీసం నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా లేదని, ఈ ఒలింపిక్స్ లో దానిని నిషేధించారని తెలిపింది. గతంలో వేరే పోటీల్లోనూ తనకు ఇవే అనుభవాలు ఎదురయ్యాయని చెప్పిన ఆమె.. గత వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ఇలాగే జరిగిందని వివరించింది.


వాస్తవానికి బౌట్ పరంగా మేరీనే పై చేయి సాధించింది. మూడింట్లో రెండు రౌండ్లను గెలిచిన ఆమె విజయపుటంచున నిలిచింది. కానీ, అనూహ్యంగా ప్రత్యర్థి కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వేలెన్సియాను జడ్జిలు విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్ లో వేలెన్సియా ఆధిపత్యం ప్రదర్శించినా.. మిగతా రెండు రౌండ్లలో మేరీదే ఆధిక్యం. అయితే, ఐదుగురు జడ్జిల్లో నలుగురు ఫస్ట్ రౌండ్ లో వేలెన్సియాకు ఓటేశారు. ఆ నలుగురు జడ్జిలు 10 చొప్పున పాయింట్లు ఇచ్చారు. మిగతా రెండు రౌండ్లలోనూ ముగ్గురు జడ్జిలు మేరీ వైపు ఉన్నా.. మొత్తం స్కోరుకు వచ్చే సరికి మేరీ వెనుకబడిపోయింది. అదే ఆమె విజయాన్ని దూరం చేసింది.

More Telugu News