టోక్యో ఒలింపిక్స్.. నేడు భారత్‌కు మిశ్రమ ఫలితాలు

30-07-2021 Fri 09:09
  • ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు దీపికా కుమారి
  • మహిళల  బాక్సింగ్‌లో సిమ్రన్‌జీత్ కౌర్ ఓటమి
  • ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 15వ స్థానంతో సరిపెట్టుకున్న మనుబాకర్
Tokyo Olympics deepika kumari enters quarter finals

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నేడు ఇప్పటి వరకు జరిగిన వివిధ క్రీడాంశాల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 8లో భాగంగా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పెరోవాతో జరిగిన పోరులో దీపిక 6-5తో విజయం సాధించింది.

ఐదు సెట్లలో దీపిక రెండు సెట్లను గెలుచుకోగా, పెరోవా రెండు సెట్లను దక్కించుకుంది. మరో సెట్ టై అయింది. అయితే, దీపికకు స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. అనంతరం జరిగిన షూటవుట్‌లో రష్యాకు చెందిన పెరోవా ఏడు పాయింట్లు మాత్రమే సాధించింది. 10 పాయింట్లు సాధించిన దీపిక మ్యాచ్‌ను కైవసం చేసుకుని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

మరోవైపు, మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ఓటమి పాలైంది. థాయిలాండ్‌కు చెందిన సుదాపోర్న్ చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలైంది. అలాగే, మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. 290 పాయింట్లతో మనుబాకర్ 15వ స్థానంతో, సర్నబోత్ రహీ 286 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్‌కు అర్హత కోల్పోయారు.