సీనియర్ నటుడు కృష్ణంరాజు అధ్యక్షతన 'మా' కార్యవర్గ సమావేశం

29-07-2021 Thu 22:09
  • 'మా' అధ్యక్ష ఎన్నికలు రసవత్తరం
  • ఈసారి బహుముఖ పోరు
  • ముగిసిన 'మా' కార్యవర్గ పదవీకాలం
  • క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు లేఖ
MAA members meet via virtual modeq

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కృష్ణంరాజు అధ్యక్షతన 'మా' కార్యవర్గం సమావేశమై ఎన్నికలపై నిర్ణయం తీసుకుంది. ఇటీవల 'మా' కార్యవర్గంలోని కొందరు తమ పదవీకాలం ముగియకముందే అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రకటించారు. దాంతో 'మా'లో విభేదాలు పొడసూపాయి. అయితే తాజాగా 'మా' కార్యవర్గం పదవీకాలం పూర్తి కావడంతో, ఎన్నికలు నిర్వహించాలంటూ 'మా' కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో, 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు అధ్యక్షతన కార్గవర్గ సమావేశం నిర్వహించారు. వర్చువల్ గా నిర్వహించిన ఈ కీలక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వచ్చే నెల 22న 'మా' సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని, ఆపై సెప్టెంబరు 12న 'మా' ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఈసారి 'మా' అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. గతంతో పోల్చితే ఈసారి బహుముఖ పోరు నెలకొంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, సీవీఎల్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఏకగ్రీవం అయ్యేట్టు ఇండస్ట్రీ పెద్దలు కృషి చేస్తే తాను రేసు నుంచి తప్పుకోవడానికి సిద్ధమని మంచు విష్ణు ఇప్పటికే ప్రకటన చేశారు.