పీవోకేలో పాకిస్థాన్ నిర్వహించిన ఎన్నికలు ఓ బూటకం: భారత్

29-07-2021 Thu 19:42
  • ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలు
  • ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 25 స్థానాలు
  • తీవ్రంగా స్పందించిన భారత్
  • ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకే ఎన్నికలని ఆరోపణ
India describes elections in POK were a drama

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అత్యధిక స్థానాల్లో నెగ్గింది. మొత్తం 45 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, తెహ్రీకే 25 చోట్ల గెలుపొందినట్టు పాక్ మీడియా పేర్కొంది. తద్వారా పీవోకేలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ పొందినట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

అయితే, భారత ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. పీవోకేలో పాక్ నిర్వహించిన ఎన్నికలు వట్టి బూటకం అని విమర్శించింది. దురాక్రమణలపై ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకే ఎన్నికలు అని పేర్కొంది. పీవోకేలో ఎన్నికల అంశంపై పాకిస్థాన్ కు గట్టిగా నిరసన తెలిపామని కేంద్రం వెల్లడించింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలను స్థానికులు తిరస్కరించారని స్పష్టం చేసింది. పీవోకేలో ఎన్నికలు స్థానికుల హక్కుల ఉల్లంఘనే అని, స్థానికుల స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించింది. భారత భూభాగాలను ఖాళీ చేయాలని పాక్ కు స్పష్టం చేశామని కేంద్రం తెలిపింది.