టిడ్కో ఇళ్ల రివర్స్ టెండరింగ్ లో రూ. 480 కోట్ల ప్రజాధనం పొదుపు అయింది: బొత్స సత్యనారాయణ

29-07-2021 Thu 18:57
  • ఒక్క రూపాయికే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం
  • ఇది విపక్షాలకు నచ్చడం లేదు
  • మొత్తం 2.62 లక్షల ఇళ్లను కట్టించేందుకు కృషి చేస్తున్నాం
Rs 480 cr saved in reverse tendering says Botsa Satyanarayana

ఒక్క రూపాయికే పేదలకు తాము ఇళ్లు ఇస్తున్నామని... ఇది కొందరికి నచ్చడం లేదని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇళ్లు నిర్మించి పేదలకు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. టిడ్కో ఇళ్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో రూ. 480 కోట్ల ప్రజాధనం పొదుపు అయిందని చెప్పారు. అయితే దీన్ని విపక్షాలు సహించలేకపోతున్నాయని దుయ్యబట్టారు.
 
టీడీపీ ప్రభుత్వ హయాంలో 4.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చి, 3.13 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, చివరకు 51,616 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే మొదలు పెట్టారని బొత్స విమర్శించారు. ఆ ఇళ్లను నిర్మించిన ఒక్క చోట కూడా సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేవని అన్నారు. షీర్ వాల్ టెక్నాలజీ అంటూ పనులను హడావుడిగా మొదలు పెట్టి, మధ్యలోనే వదిలేశారని చెప్పారు.
 
2.62 లక్షల ఇళ్లను కట్టించేందుకు తాము కృషి చేస్తున్నామని బొత్ప తెలిపారు. 90 వేల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పన కూడా 100 రోజుల్లోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మిగిలిన ఇళ్లను మరో ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.