'కిరాతక' రెగ్యులర్ షూటింగుకు ముహూర్తం ఖరారు!

29-07-2021 Thu 18:50
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో 'కిరాతక'
  • వచ్చేనెల 13 నుంచి షూటింగ్
  • కీలకపాత్రలో దాసరి అరుణ్ కుమార్
  • ముఖ్య పాత్రలో దేవ్ గిల్
Kirathaka reguler shooting stats from 13th August

ఆది సాయికుమార్ వరుసగా ఓ మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటిగా 'కిరాతక' రూపొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాకి వీరభద్రం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆది సాయికుమార్ జోడీగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

కరోనా తీవ్రత కారణంగా వెయిట్ చేస్తూ వచ్చారు. కరోనా ప్రభావం చాలావరకూ తగ్గడంతో ఇక రెగ్యులర్ షూటింగును జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చేనెల 13వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగు జరపనున్నట్టు అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నాడు. దాసరి అరుణ్ కుమార్ .. దేవ్ గిల్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆది సాయికుమార్ ఉన్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ఆయన 'అమరన్' అనే మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.