Darshith: ఈ బాలుడు చిచ్చరపిడుగు... తనను కరిచిన పామును చంపి ఆసుపత్రికి తీసుకెళ్లాడు!

  • తమిళనాడులో ఘటన
  • పొలంలో ఆడుకుంటూ పాము కాటుకు గురైన చిన్నారి
  • రాళ్లతో రక్తపింజరిని కొట్టిచంపిన వైనం
  • వైద్యులు ఆశ్చర్యపోయేలా సమాధానం
Tamilnadu boy Darshith killed the snake which bitten him

భారతదేశంలోని విషపూరితమైన పాముల్లో రక్తపింజరి ఒకటి. ఇది కరిస్తే దాదాపు మరణం తథ్యం. సకాలంలో వైద్యం అందితే సరి... లేకపోతే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇక అసలు విషయానికొస్తే... తమిళనాడులో ఓ బాలుడు తనను రక్తపింజరి పాము కాటేసినా భయపడకుండా, ఆ పామును వెంటాడి చంపి దానితో సహా ఆసుపత్రికి వెళ్లాడు.

కాంచీపురం ప్రాంతంలోని ఏకనాంపేటకు చెందిన ఏడేళ్ల దర్శిత్ 3వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల తన బామ్మ గారి ఊరైన వేల్లైకోట్టై వెళ్లాడు. పొలంలో ఆడుకుంటుండగా ఏదో కరిచినట్టు అనిపించడంతో, అక్కడ రక్తపింజరి పాము కనిపించింది. దాంతో ఆ పామును రాళ్లతో కొట్టి చంపి, ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులకు తనను పాము కాటేసిన విషయం చెప్పాడు. దాంతో వారు దర్శిత్ ను ఆసుపత్రికి తరలించారు. చచ్చిన పామును కూడా తీసుకెళ్లారు.

అయితే దర్శిత్ లో ఎలాంటి విషప్రభావం కనిపించకపోవడంతో రెండ్రోజుల అనంతరం ఇంటికి పంపారు. కానీ, కొన్నిరోజుల అనంతరం పాము కాటేసిన కాలు విపరీతంగా వాచింది. దాంతో చెన్నై తీసుకెళ్లి అక్కడి ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స అందడంతో దర్శిత్ కోలుకున్నాడు.

డిశ్చార్జి చేసే ముందు వైద్యులు... దర్శిత్ తో మాట్లాడారు. పామును ఎందుకు చంపావు? దాన్ని ఆసుపత్రికి ఎందుకు తీసుకువచ్చావు? అని వారు ప్రశ్నించారు. కాటేసింది ఏ జాతి పాము అనే విషయం తెలిస్తే కదా చికిత్స చేసేది? అని తెలివిగా సమాధానం ఇవ్వడంతో వారు ఆశ్చర్యపోయారు. ఔరా అనుకున్న అక్కడి వైద్యులు చిన్నారి దర్శిత్ పరిజ్ఞానాన్ని, అతడి ధైర్యాన్ని అభినందించారు.

More Telugu News