తాడేపల్లిలో కలకలం రేపిన మృతదేహాలు

29-07-2021 Thu 17:20
  • ఒక ఇంట్లో లభ్యమైన భార్యాభర్తల మృతదేహాలు
  • ఇంట్లో లభించని ఆధారాలు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
Two dead bodies identified in Tadepalli

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. బకింగ్ హామ్ కెనాల్ పక్కన ఉండే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. ఇంటి మొత్తాన్ని పరిశీలించినా వారి మరణాలకు గల ఆధారాలు పోలీసులకు లభించలేదు. అంతేకాదు వారి పేర్లు, ఊరు, ఇతర వివరాలు కూడా ఆ ఇంట్లో లేకపోవడంతో... అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే మృత దేహాలు పడి ఉన్న ప్రాంతంలో మందులు, ఆధ్యాత్మిక సీడీలు, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు దొరికినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక సమాచారం లభించలేదని చెప్పారు.