Australia: పెరుగుతున్న కరోనా కేసులు.. మిలటరీ సాయం కోరిన సిడ్నీ

  • ఆంక్షలు మరింత కఠినం
  • 300 మంది సైనికుల మోహరింపు కోసం విజ్ఞప్తి
  • ఇంటి నుంచి 5 కిలోమీటర్లు దాటి పోవద్దని ప్రజలకు ఆదేశం
Sydney Asks For Military Help to Control covid Cases

కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీ కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితి మరింత విషమించే ప్రమాదముందని భావించి.. సైన్యం సాయాన్ని కోరింది. కఠిన లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేసేలా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

ఇటీవలి కాలంలో డెల్టా కేసులు పెరిగిపోతుండడం, నియంత్రణలోకి రాకపోవడంతో ఆస్ట్రేలియా లాక్ డౌన్ విధించింది. ఇప్పటికి ఐదు వారాలు గడిచిపోయింది. అయినా, కరోనా కేసులు తగ్గలేదు. లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే లక్షన్నర కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ..  రెండో మాంద్యంలోకి కూరుకుపోయే పరిస్థితి రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రస్తుతం సిడ్నీలో నిన్న ఒక్క రోజే 239 కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. మహమ్మారి వచ్చినప్పటి నుంచి అక్కడ నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే ఎక్కువని ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని న్యూసౌత్ వేల్స్ ముఖ్యమంత్రి గ్లాడిస్ బియర్జెక్లియన్ అన్నారు. ఇక్కడ మరొకరు కరోనా బారిన పడి చనిపోయారని తెలిపారు. నైరుతి సిడ్నీ, పశ్చిమ సిడ్నీల్లో కొత్తగా ఆంక్షలను పెడుతున్నామని స్పష్టం చేశారు. 20 లక్షల మందికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎవరూ తమ ఇళ్ల నుంచి ఐదు కిలోమీటర్లు దాటి వెళ్లొద్దన్నారు. కొత్తగా విధించిన లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు 300 మంది సైనికులను మోహరిస్తున్నామని న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మిక్ ఫుల్లర్ చెప్పారు. ఇప్పటికే విక్టోరియా రాష్ట్రంలోనూ సైనికులను మోహరించారు.

More Telugu News