Judge: జడ్జి దారుణ హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ: వీడియో​ ఇదిగో

Judge Brutally Murdered And Created as An Accident
  • సీసీటీవీ ఫుటేజీతో దొరికిపోయిన దుండగులు
  • దొంగిలించిన ఆటోతో ఘాతుకం
  • న్యాయవ్యవస్థపై దాడి అన్న సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్
  • సుమోటో విచారణ చేపట్టాలని సుప్రీంకు విజ్ఞప్తి
అప్పటిదాకా ఆ జడ్జి రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారనుకున్నారు. కానీ, సీసీటీవీ ఫుటేజీ చూస్తేగానీ అసలు నిజమేంటో తెలియలేదు. అది యాక్సిడెంట్ కాదు.. కావాలని ఆటోతో ఢీకొట్టి చంపేశారని ఆ ఫుటేజీ తేటతెల్లం చేసింది. ఈ ఘటన ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగింది. నిన్న తెల్లవారుజామున 5 గంటలకు ధన్ బాద్ జిల్లా అదనపు జడ్జి ఉత్మ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టేసింది.

రోడ్డంతా ఖాళీగా ఉన్నా.. అప్పటికే రోడ్డు మధ్య నుంచి వెళుతున్న ఆ ఆటో.. ఆ జడ్జి సమీపిస్తున్న క్రమంలో దానిని పూర్తిగా ఎడమవైపునకు పోనిచ్చారు. వేగంగా ఆయనను ఢీకొట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డుపై చలనం లేకుండా పడిపోయారు. స్థానికులు చూసి సమాచారమివ్వగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

కేసు నమోదు చేసిన గిరిధ్ పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేసి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాంతో వారికి అసలు విషయం తెలిసింది. అది యాక్సిడెంట్ కాదు.. హత్య అని రూఢీ చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అది దొంగిలించిన ఆటో అని పోలీసులు నిర్ధారించారు.

కాగా, కేసును సుమోటోగా తీసుకుని విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడి అని పేర్కొంది. వీడియో చూస్తుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోందని తెలిపింది.
Judge
Jharkhand
Supreme Court
Murder
Crime News

More Telugu News