ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా.. జరిమానా విధించిన సెబీ!

29-07-2021 Thu 12:52
  • వియాన్ ఇండస్ట్రీస్ లావాదేవీల్లో అవకతవకలు
  • ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను అతిక్రమించారన్న సెబీ
  • రూ. 3 లక్షల జరిమానా విధింపు
Shilpa Shetty and Raj Kundra Fined 3 Lakh For Insider Trading By SEBI
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు మరో షాక్ తగిలింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వీరికి, వీరి కంపెనీ వియాన్ ఇండస్ట్రీస్ కి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రూల్స్ ను అతిక్రమించారనే కారణాలతో ఫైన్ విధించింది.

వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)కు సంబంధించి 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ట్రేడింగ్/డీలింగ్ పై విచారణ జరిపామని సెబీ తెలిపింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, వియాన్ ఇండస్ట్రీస్ లు సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రెగ్యులేషన్స్ కు సంబంధించిన 7(2)(ఏ), 7(2)(బీ)లను అతిక్రమించారనే విషయం విచారణలో తేలిందని ప్రకటించింది.

2015లో తమ సంస్థకు చెందిన 5 లక్షల ఈక్విటీ షేర్లను నలుగురు వ్యక్తులకు ప్రిఫరెన్సియల్ అలాట్ మెంట్ ద్వారా కేటాయిస్తున్నామని వియాన్ ఇండస్ట్రీస్ తెలిపిందని... వీటిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు 1,28,800 షేర్ల వంతున అలాట్ చేసిందని సెబీ వెల్లడించింది. అయితే, సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ నిబంధన 7(2)(ఏ) ప్రకారం... రూ. 10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే... రెండు ట్రేడింగ్ దినాల్లోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రమోటర్లు అందజేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే వీరు ఆ పని చేయలేదని వ్యాఖ్యానించింది. శెట్టి, కుంద్రాలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్దారని తెలిపింది. తాము విధించిన రూ. 3 లక్షల జరిమానాను వీరు 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.