టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష

28-07-2021 Wed 19:22
  • తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకోలో పాల్గొన్న వినయ్ భాస్కర్
  • ఆయనతో పాటు 18 మందికి రూ. 3 వేల జరిమానా
  • వినయ్ భాస్కర్ విన్నపం మేరకు బెయిల్ మంజూరు
Jail sentence to TRS MLA Vinay Bhaskar

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్షను విధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టిన కేసుకు సంబంధించి శిక్షను ఖరారు చేసింది. ఆయనపై నేరం రుజువైనట్టు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. ఇదే కేసులో వినయ్ భాస్కర్ తో పాటు 18 మందికి కోర్టు రూ. 3 వేల జరిమానా విధించింది. మరోవైపు, వినయ్ భాస్కర్ అభ్యర్థన మేరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది.