Rahul Gandhi: దేశ ప్రజల ఫోన్లలో కేంద్రం ఆయుధం పెట్టింది: రాహుల్​ గాంధీ

PM Modi Puts A Weapon In Phones Alleges Rahul Gandhi
  • ప్రజాస్వామ్య ఆత్మపై దెబ్బకొట్టింది
  • అతిపెద్ద దేశద్రోహానికి పాల్పడింది
  • 14 పార్టీలతో కలిసి నిరసన
పెగాసస్ అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశ ప్రజల ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం ‘ఆయుధం’ పెట్టిందని, తద్వారా అతిపెద్ద దేశద్రోహానికి పాల్పడిందని ఆయన విమర్శించారు. పెగాసస్ అంశంపై వివిధ పార్టీల నేతలతో సమావేశమైన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్ లో తమ గొంతు నొక్కేశారని, పెగాసస్ అంశంపై మాట్లాడనివ్వలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ను కొన్నదా? లేదా? స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. దేశ ప్రజలపై దానిని వాడారా? లేదా? అని ప్రశ్నించారు. పెగాసస్ అనేది తమకు దేశద్రోహం లాంటిదేనని, ఈ ఆయుధాన్ని ప్రజాస్వామ్యంపై వాడారని అన్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది కాదన్నారు. ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని మోదీ, అమిత్ షాలు ప్రజలపై వాడారన్నారు. దేశ ప్రజాస్వామ్యపు ఆత్మపై వారిద్దరూ దెబ్బకొట్టారన్నారు.

పార్లమెంట్ లో పెగాసస్ అంశాన్ని ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. తాము పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నామంటూ ప్రభుత్వం ఆరోపిస్తోందని, అయితే, తమ విధులనే తాము నిర్వర్తిస్తున్నామని రాహుల్ అన్నారు. కాగా, పెగాసస్ అంశంపై 14 పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ పోరాటానికి సిద్ధమయ్యారు.
Rahul Gandhi
Congress
Pegasus

More Telugu News