ఇక, మేమే దగ్గరుండి చూసుకుంటాం: ‘రామప్ప సంరక్షణ’పై హైకోర్టు వ్యాఖ్యలు

28-07-2021 Wed 14:06
  • వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలని సర్కార్ కు ఆదేశం
  • నిర్లక్ష్యం చేస్తే దేశమంతా నిందిస్తుంది
  • కేంద్ర, రాష్ట్ర పురాతత్వ శాఖలు, కలెక్టర్ తో కమిటీ వేయండి
  • వచ్చే నెల 4న సమావేశం నిర్వహించండి
High Court Asks Telangana To Start Restoration Of Ramappa

ప్రపంచ వారసత్వ సంపద ‘రామప్ప’ దేవాలయం సంరక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. రామప్పకు ప్రపంచ గుర్తింపు రావడం రాష్ట్రానికి గర్వకారణమని, కానీ, అలాంటి రామప్పను నిర్లక్ష్యం చేస్తే దేశం మొత్తం నిందిస్తుందని అసహనం వ్యక్తం చేసింది. యునెస్కో గడువు విధించిన డిసెంబర్ లోపు రక్షణ చర్యలను ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. రామప్ప అభివృద్ధి, సంరక్షణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.

రామప్ప సంరక్షణపై వార్తా పత్రికలు, చానెళ్లలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల హైకోర్టు ధర్మాసనం.. ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర పురాతత్వ శాఖలు, జిల్లా కలెక్టర్ తో వెంటనే కమిటీని వేయాలని, క్షేత్రస్థాయి పరిశీలన చేసి వచ్చే నెల 4న కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించాలని తేల్చి చెప్పింది.

నెలలోగా రామప్ప సంరక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను అభివృద్ధి చేయాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు సూచించింది. ఈ కట్టడం చారిత్రకంగా ఎంతో అమూల్యమైనదని, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతోందని పేర్కొంది.