దేవినేని ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు.. టీడీపీ ఫైర్

28-07-2021 Wed 10:04
  • గతరాత్రి ఉమను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • ఉదయం అక్కడి నుంచి నందివాడకు తీసుకెళ్లిన పోలీసులు
  • నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేయడం దారుణమన్న టీడీపీ
Police Filed Atrocity Case against Devineni Uma

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గత రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతోపాటు 307 కింద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. గత రాత్రి ఉమను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు, కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో పరిశీలనకు వెళ్లిన ఉమ తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీడీపీ వైసీపీపై విరుచుకుపడింది. వైసీపీ గూండా రాజకీయాలను ఖండిస్తున్నట్టు, ఒక్కరిపై 100 మంది దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

 వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిందితులను వదిలేసి, బాధితులను అరెస్ట్ చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమను వదిలేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.