Telangana: తెలంగాణలో మహిళలను వేధిస్తున్న వారిలో 24 ఏళ్ల లోపు యువకులే ఎక్కువ: వెల్లడించిన నివేదిక

  • ఆరు నెలల్లో 2,803 ఫిర్యాదులు
  • ఫోన్ల ద్వారా వేధింపులే ఎక్కువ
  • నిందితుల్లో 42 మంది 50 ఏళ్లు పైబడిన వారే
  • నివేదిక వెల్లడించిన మహిళా భద్రతా విభాగం
Youth who harass women are below 24 years

తెలంగాణలో మహిళలను వేధిస్తున్నవారిలో యువకులే ఎక్కువగా ఉన్నట్టు నిన్న విడుదలైన ఓ నివేదిక పేర్కొంది. షీ టీంల పనితీరుకు సంబంధించి మహిళా భద్రతా విభాగం నిన్న నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఆరు నెలల్లో 2,803 ఫిర్యాదులు అందాయి. వీటిలో 1,251 మంది నిందితులను గుర్తించారు. ఇందుకు సంబంధించి 271 ఎఫ్ఐఆర్‌లు, 325 పెట్టీ కేసులు నమోదయ్యాయి.

బాధితుల్లో ఎక్కువమంది మహిళలు ఫోన్‌లోనే వేధింపులు ఎదుర్కొంటున్నట్టు నివేదిక వెల్లడించింది. కాగా, 171 ఫిర్యాదులు పెండింగులో ఉండగా, 1048 ఫిర్యాదులను క్లోజ్ చేశారు. నిందితుల్లో 363 మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా, 625 మందిని హెచ్చరించి వదిలేశారు. వేధింపులకు పాల్పడుతున్న 114 మంది నిందితులను షీటీంలు పట్టుకున్నాయి.

ఇక నిందితుల్లో 123 మంది 18 ఏళ్లలోపువారు కాగా, 489 మంది 19 నుంచి 24 ఏళ్లలోపు వారు. 442 మంది 25 నుంచి 35 ఏళ్లలోపువారు ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 36 నుంచి 50 ఏళ్ల లోపున్న నిందితులు 155 మంది ఉండగా, 42 మంది 50 ఏళ్లపైబడిన వారు ఉండడం గమనార్హం.

More Telugu News