దేవినేని ఉమపై దాడిని ఖండిస్తూ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

27-07-2021 Tue 21:50
  • గడ్డ మణుగు గ్రామం వద్ద ఉమ కారుపై దాడి
  • రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ప్రజల గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్యలు
  • నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
Chandrababu wrote DGP in the wake of attack on Devineni Uma

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఎలుగెత్తుతున్న దేవినేని ఉమపై ఇవాళ గడ్డ మణుగు గ్రామం వద్ద దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దేవినేని ఉమపై దాడిని ఖండిస్తూ డీజీపీకి లేఖ రాశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో మాఫియా, గూండాగిరి పెరిగిందని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం, పోలీసులు కలిసి ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ, టీడీపీ కార్యకర్తలపై దాడే అందుకు ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. దేవినేని ఉమ కారుపై రాళ్లు విసిరి, కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినా ఎవరినీ అరెస్ట్ చేయలేదని డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. అమరావతి పరిసరాల్లో ఇలాంటి ఘటన జరగడం దారుణమని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రాళ్ల దాడి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు.