కన్నడ స్టార్ హీరోకి జోడీగా త్రిష!

27-07-2021 Tue 18:25
  • తెలుగులో వెలిగిన త్రిష
  • తమిళంలో తగ్గని జోరు
  • మలయాళంలోను క్రేజ్
  • కన్నడ నుంచి ఆఫర్లు
Trisha in Puneeth Rajkumar movie

తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లో త్రిషకి మంచి క్రేజ్ ఉంది. ఒకానొక దశలో త్రిష టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. స్టార్ హీరోయిన్ స్థానంలో చాలాకాలం పాటు తన జోరును చూపించింది. అదే సమయంలో ఆమె తమిళంలోను స్టార్ హీరోల జోడీగా భారీ విజయాలను తన ఖాతాలో జమచేసుకుంది.

ఆ తరువాత ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, తమిళంలో మాత్రం ఎక్కువగా నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ప్రస్తుతం తమిళంలోనే ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాల్లో కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. అలాంటి త్రిషకి కన్నడ నుంచి మరో ఛాన్స్ వెళ్లిందని అంటున్నారు.

ఆ మధ్య కన్నడలో త్రిష .. పునీత్ రాజ్ కుమార్ సరసన నాయికగా 'పవర్' సినిమాలో నటించింది. ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లనే రాబట్టింది. మళ్లీ ఇప్పుడు ఆయన జోడీగానే చేయనుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కుమార్ దర్శకత్వంలో పునీత్ 'ద్విత్వ' అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసమే త్రిషను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.