ప్రభాస్ కొత్త సినిమాలో సమంత?

27-07-2021 Tue 16:28
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్  
  • ప్రభాస్ సరసన నాయికగా దీపిక పదుకొణే
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
  • కీలక పాత్రకు సమంతతో సంప్రదింపులు
Samanta to play key role in Prabhas movie

పెళ్లయ్యాక హీరోయిన్లకు ఇక కెరీర్ స్లో అయిపోతుందనుకుంటాం. చాలా మంది నాయికలు అలా పెళ్లి కాగానే మెల్లిగా నటన నుంచి తప్పుకుని సంసార జీవితంలో పడిపోతారు కూడా. ఇది ఎప్పటి నుంచో మనం చూస్తూనే వున్నాం.

అయితే, ఇటీవలి కాలంలో కొందరి విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. అందుకు మంచి ఉదాహరణలుగా సమంత .. కాజల్ లను తీసుకోవచ్చు. వీళ్లిద్దరిలోనూ సమంత అయితే మరీ భిన్నంగా కనిపిస్తుంది. పెళ్లయి నాలుగేళ్లవుతున్నా ఈ ముద్దుగుమ్మకు ఇంకా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు, వెబ్ సీరీస్ చేస్తున్న సమంతకు తాజాగా ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా వచ్చిందట.

ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. 'ప్రాజక్ట్ K' అనే వర్కింగ్ టైటిల్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ బిజీ భామ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

ఇక ఇందులో ఓ ముఖ్య పాత్రకు గాను ప్రస్తుతం సమంతతో ఫిలిం మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో సమంత కూడా దీనిపట్ల ఆసక్తి చూపుతోందట. ఇక ఆమె దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ ప్రాజక్టుకి మరింత గ్లామర్ వస్తుందనే చెప్పచ్చు.