Fake Notices: 'పోర్న్ వీడియోలు చూస్తున్నందుకు జరిమానా కట్టండి!' అంటూ నకిలీ నోటీసులు పంపుతున్న కేటుగాళ్లు!

  • వెలుగుచూసిన మరో ఆన్ లైన్ మోసం
  • పోర్న్ చూసేవాళ్లే టార్గెట్
  • చూడని వాళ్లకూ నకిలీ నోటీసులు
  • ముగ్గుర్ని అరెస్ట్ చేసిన ఢిల్లీ సైబర్ పోలీసులు
Police arrests three men who cheating with fake notices

సైబర్, ఆన్ లైన్ మోసాలకు అంతులేకుండా పోతోంది. ఆన్ లైన్ లో పోర్న్ వీడియోలు వీక్షిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీకి తెరలేపిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 'ఆన్ లైన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నందుకు మీరు జరిమానా చెల్లించాల్సిందే'నంటూ వారు నకిలీ నోటీసులు పంపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కాంబోడియా దేశంలోని ఓ వెబ్ అడ్రస్ ద్వారా ఈ నకిలీ నోటీసులు వస్తున్నట్టు వెల్లడైంది.

ఈ ముఠా సభ్యులు తొలుత ఆన్ లైన్ లో పోర్న్ చూసేవారిని గుర్తిస్తారు. ఆపై వారి కంప్యూటర్లకు నకిలీ నోటీసులు పంపిస్తారు. వెబ్ సైట్లలో దర్శనమిచ్చే పాప్ అప్ విండోల రూపకల్పనలో ఉపయోగించే సాంకేతికత, యాడ్వేర్ టెక్నాలజీ ఉపయోగించి నకిలీ నోటీసులను పంపేవారు. రూ.3 వేలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసేవారు. అప్పటివరకు వారి కంప్యూటర్లను పనిచేయనివ్వకుండా అడ్డుకునేవారు.

దీనిపై ఢిల్లీ పోలీసులు సుమోటోగా స్పందించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని పోస్టుల ఆధారంగా సైబర్ సెల్ రంగంలోకి దిగి నిందితులను గుర్తించింది. చెన్నైకి చెందిన గాబ్రియెల్ జేమ్స్, రామ్ కుమార్, తిరుచ్చికి చెందిన బి.దినుశాంత్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దినుశాంత్ ఈ తరహా మోసానికి సూత్రధారి అని గుర్తించారు. కాగా, పోర్న్ చూడని వారికి కూడా ఈ ముఠా నకిలీ నోటీసులు పంపేదని సైబర్ సెల్ డీసీపీ అన్వేష్ రాయ్ వెల్లడించారు.

ఇక, పోలీసుల విచారణలో దినుశాంత్ ఆసక్తికర అంశం బయటపెట్టాడు. తన సోదరుడు బి.చంద్రకాంత్ కాంబోడియాలోని నామ్ ఫెన్ లో ఉంటూ ఈ నకిలీ దందా నిర్వహణలో తోడ్పాటు అందించేవాడని తెలిపాడు. పోలీసులు నిందితులకు సంబంధించిన 20 బ్యాంకు ఖాతాలను నిలిపివేయించారు. నకిలీ నోటీసుల సాయంతో ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య కాలంలో దాదాపు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు వెల్లడైంది.

More Telugu News