CM Jagan: అధికారుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం

  • సరైన పనితీరు కనబర్చకపోతే మెమోలు ఇవ్వాలని ఆదేశం
  • క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాల్సిందేనని స్పష్టీకరణ
  • తాడేపల్లిలో స్పందన కార్యక్రమం
  • హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు
CM Jagan disappoints with officials performance

ఏపీ సీఎం జగన్ అధికారుల తీరుపై ఆగ్రహం ప్రదర్శించారు. విధి నిర్వహణలో సరైన పనితీరు కనబర్చని వారికి మెమో జారీ చేయాలని వివిధ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. వారానికి నాలుగు పర్యాయాలు గ్రామ/వార్డు సచివాలయాలను సందర్శించాలని అధికారులకు చెప్పామని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పులు జరిగితే వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని అన్నారు. కలెక్టర్లు, జేసీల పర్యవేక్షణ విధానం బాగుందని, వారి తరహాలోనే ఇతర అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేయాలని నిర్దేశించారు.

కలెక్టర్లు, జేసీలు మినహా ఇతర అధికారులు సరిగా తనిఖీలు చేయడంలేదని అన్నారు. ఐటీడీఏ పీవోలు 18 శాతం, సబ్ కలెక్టర్లు 21 శాతం తనిఖీలు చేశారని వెల్లడించారు. వచ్చే స్పందన నాటికి నూటికి నూరుశాతం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా...  గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అర్బన్ హెల్త్ క్లినిక్కులు తదితర అంశాలపై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు.

More Telugu News