వెయిట్ లిఫ్టర్ చానును అనుకరించి.. అందరినీ కట్టిపడేసిన చిన్నారి!: వీడియో వైరల్​

27-07-2021 Tue 15:01
  • బరువునెత్తి ఔరా అనిపించిన వైనం
  • చాలా ముద్దుగా ఉందన్న చాను
  • ఒలింపిక్స్ లో రజతం గెలిచిన వెయిట్ లిఫ్టర్
Girl Imitates Olympics Silver Winner Meerabai Chanu

మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్ లో మొదటి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించింది. ఆమెకు వేనోళ్లా ప్రశంసలు వెల్లువెత్తాయి. మణిపూర్ ప్రభుత్వం ఆమెకు ఎఎస్పీగా ఉద్యోగమిచ్చింది. దాంతో పాటు కోటి రూపాయల పారితోషికం కూడా ప్రకటించింది. కట్టెలు మోసిన చేతులతో బరువునెత్తి రజత పతకం సాధించిన మీరాబాయి చాను.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. పెద్దలే కాదు.. పిల్లలూ ఆమెను చూసి ఆమెలా కావాలనుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ చిన్నారి.. మీరా ఒలింపిక్స్ పెర్ఫార్మెన్స్ చూస్తూ తానూ బరువులెత్తుతూ అనుకరించింది. చేతికి పౌడర్ అద్దుకుని, వెయిట్ లిఫ్టింగ్ రాడ్ గ్రిప్ ను సరిచూసుకుని బరువును ఎత్తేసింది. ఆ వీడియోను కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలిచిన సతీశ్ శివలింగమ్ ట్వీట్ చేశాడు. మీరా చానును ట్యాగ్ చేశాడు. ‘‘జూనియర్ మీరాబాయి చాను.. ఇదే కదా అసలైన స్ఫూర్తి’’ అంటూ కామెంట్ పెట్టాడు.

ఆ వీడియోను రీట్వీట్ చేసిన చాను.. చాలా ముద్దుగా ఉందంటూ పొంగిపోయింది. నెటిజన్లూ ఆ వీడియో చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. వేలాది మంది వీడియోను రీట్వీట్ చేశారు. ఇప్పటిదాకా 64 వేల మంది లైక్ చేశారు. అయితే ఆ చిన్నారి ఎవరన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.