వచ్చే నెల నుంచి చిన్నారులకు కరోనా టీకా!: కేంద్రం

27-07-2021 Tue 14:46
  • బీజేపీ సమావేశంలో వెల్లడించిన ఆరోగ్య మంత్రి
  • సెప్టెంబర్ నుంచి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ ఇప్పటికే ప్రకటన
  • ట్రయల్స్ పూర్తి చేసుకున్న జైడస్
  • 2 నుంచి 6 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ ట్రయల్స్
Covid Vaccine For Kids Can Be Rolled Out From Next Month Says Health Minister

చిన్నారులకు వచ్చే నెల నుంచి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ ఎంపీలకు వెల్లడించారు. వచ్చే నెల నుంచి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు.

ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు వచ్చే నెల నుంచి పిల్లలకు టీకాలేస్తే కరోనా చెయిన్ ను తెంచేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపైనే ఉంటుందన్న భయాల నేపథ్యంలో ఇది ఓ మంచి నిర్ణయమవుతుందని చెబుతున్నారు. బడులనూ తెరిచేందుకు వీలవుతుందని అంటున్నారు.

సెప్టెంబర్ నుంచి పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కొన్ని రోజుల క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పిన సంగతి తెలిసిందే. 12 నుంచి 18 ఏళ్ల చిన్నారులు, టీనేజర్లపై జైడస్ క్యాడిలా ట్రయల్స్ పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో 2 నుంచి 6 ఏళ్ల పిల్లలపై భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ నడుస్తున్నాయి. అవి కూడా పూర్తి కావొచ్చినట్టు తెలుస్తోంది.

175 మంది చిన్నారులను రెండు విభాగాలుగా విభజించి ట్రయల్స్ చేస్తున్నారు. రెండో డోస్ ట్రయల్స్ తర్వాత మరికొన్ని రోజుల్లో మధ్యంతర ఫలితాలను భారత్ బయోటెక్ విడుదల చేయనుందని తెలుస్తోంది. కొవాగ్జిన్ ట్రయల్స్ కు మే 12న డీసీజీఐ అనుమతినివ్వగా.. జూన్ 7న ట్రయల్స్ ను మొదలుపెట్టారు. ఫైజర్ బయోఎన్ టెక్ టీకా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.