బెంగళూరుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌

27-07-2021 Tue 14:22
  • తదుపరి సీఎం ఎంపిక నేపథ్యంలో బెంగళూరుకు వెళ్తున్న వైనం
  • బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న కేంద్ర మంత్రులు
  • రాత్రిలోగా సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం
Kishan Reddy and Dharmendra Pradhan going to Bengaluru

బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ లు ఈ సాయంత్రం బెంగళూరుకు చేరుకోనున్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో వీరు భేటీ కానున్నారు. ఆరెస్సెస్ నేపథ్యంతో పాటు స్థానిక సామాజికవర్గాల ప్రాతిపదికన సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.

సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, బీఎస్ సంతోష్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, తేజస్వి సూర్య, బసవరాజ బొమ్మై పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో జోషి, సంతోశ్, విశ్వేశ్వర హెగ్డే, తేజస్వి సూర్యలకు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బసవరాజ బొమ్మై బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆరెస్సెస్ నేపథ్యం లేదు. వీరితో పాటు అరవింద బెల్లర్, మురుగేశ్ నిరాణిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ రాత్రి లోగా తదుపరి సీఎం పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.