MANSAS Trust: అశోక్ గజపతిరాజు ఇచ్చే ఆదేశాలు పాటించాల్సిందే... మాన్సాస్ ఈవోకు హైకోర్టు స్పష్టీకరణ

  • వివాదాస్పదంగా మారిన మాన్సాస్ ఈవో వ్యవహారం
  • ఇటీవల ఉద్యోగుల ముట్టడి
  • అశోక్ గజపతిరాజు సైతం ఈవో తీరుపై అసంతృప్తి
  • హైకోర్టులో పిటిషన్.. నేడు విచారణ
High Court said MANSAS Executive Officer must obey Ashok Gajapathiraju orders

ఇటీవల మాన్సాస్ విద్యాసంస్థల సిబ్బంది మాన్సాస్ ట్రస్టు ఈవో కార్యాలయాన్ని ముట్టడించడం తెలిసిందే. తమకు 16 నెలలుగా సరిగా జీతాలు చెల్లించడంలేదని వారు ఈవోపై ధ్వజమెత్తారు. అటు, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు కూడా ఈవో వెంకటేశ్వరరావుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవో తన మాట వినడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.

వాదనలు విన్న పిమ్మట హైకోర్టు ఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్టు చైర్మన్ ఆదేశాలను ఎందుకు పాటించరు? అని ప్రశ్నించింది. అసలు, ట్రస్టు వ్యవహారాల్లో ఈవో పాత్ర ఏమిటని వివరణ కోరింది. ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఇచ్చే ఆదేశాలను ఈవో గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది. ట్రస్టు సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ట్రస్టు అకౌంట్లు సీజ్ చేయాలని, పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేసింది.

ట్రస్టు కార్యకలాపాలపై ఆడిట్ అధికారితో మాత్రమే ఆడిట్ చేయించాలని, ఇతరుల ప్రమేయం ఉండరాదని హైకోర్టు తెలిపింది. స్టేట్, లేదా డిస్ట్రిక్స్ ఆడిట్ ఆఫీసర్ మాత్రమే మాన్సాస్ ట్రస్టులో ఆడిట్ నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఆపై, తదుపరి విచారణను వాయిదా వేసింది.

More Telugu News