హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అక్రమాలకు తెరలేపింది: ఈసీకి గోనె ప్రకాశ్ రావు లేఖ

27-07-2021 Tue 14:00
  • కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతోంది
  • టీఆర్ఎస్ చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టాలి
  • పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి
Gone Prakash writes letter to EC on Huzurabad election

హుజూరాబాద్ ఉపఎన్నికను వెంటనే నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు లేఖ రాశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ పై కూడా ఆయన ఇదే లేఖలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉందని గోనె ప్రకాశ్ అన్నారు. అయితే ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు.

కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ఖర్చుపై నిఘా ఉంచాలని, అక్రమాలను అడ్డుకోవాలని చెప్పారు. రాష్ట్ర పోలీసులతో కాక కేంద్ర పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలను నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను అడ్డుకోవడం సాధ్యం కాదని అన్నారు.

మరోవైపు ఈటల రాజేందర్ కు తాను మద్దతిస్తున్నట్టు గోనె ప్రకాశ్ నిన్ననే ప్రకటించారు. కరోనా కాలంలో కూడా అలుపెరగకుండా శ్రమించిన నేత ఈటల అని కితాబునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంటుందని... అలాంటి చోట బీసీ నేత అయిన ఈటల ఆరు సార్లు గెలిచారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు నైతిక విలువలు కలిగినవారని... ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా అంతుబట్టని రీతిలో తీర్పును వెలువరిస్తారని తెలిపారు.