ఉత్కంఠను రేకెత్తిస్తున్న 'ఇష్క్' ట్రైలర్!

27-07-2021 Tue 12:19
  • 'ఇష్క్' నుంచి మరో ట్రైలర్
  • కొత్త దర్శకుడి పరిచయం
  • ఆసక్తిని రేపుతున్న కథ
  • ఈ నెల 30వ తేదీన రిలీజ్
Ishq Movie Trailer Released

తేజ సజ్జ కథానాయకుడిగా 'ఇష్క్' సినిమా రూపొందింది. ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా, ఎన్వీ ప్రసాద్ ..  పారాస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. కొన్ని రోజుల క్రితమే విడుదలకు ముస్తాబైన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ నెల 30వ తేదీన థియేటర్లకు రావడానికి సిద్ధమైపోయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. అయితే అదే సమయంలో ఆయనకి కొందరు వ్యక్తులు తారసపడతారు. అప్పటి నుంచి ఆయన మూడ్ మారిపోతుంది. అందుకు కారణం ఏమిటి? ఆయన గతంలో వాళ్ల పాత్ర ఏమిటి? అనేదే కథ.

ఈ ట్రైలర్ చూస్తే .. ఈ సినిమాకి 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనే టైటిల్ ను ఎందుకు సెట్ చేశారనేది తెలుస్తుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండి, సినిమాపై అంచనాలు పెంచుతోంది. దర్శకుడు రాజు కొత్త కాన్సెప్టును ఎంచుకున్నాడనే అనిపిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే ప్రియా ప్రకాశ్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.