పోలీసులపై దాడి చేసిన ఇసుక మాఫియా

27-07-2021 Tue 11:23
  • జగిత్యాల జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
  • పక్కా సమాచారంతో వాగులోకి వెళ్లిన పోలీసులు
  • కర్రలు, రాళ్లతో దాడి చేసిన దుండగులు
Sand mafia attacks police in Jagtial District

తెలంగాణలో ఇసుకాసురులు ఎంతకైనా తెగించేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడింది. మల్లాపూర్ మండలం వేంపల్లి శివారులోని వాగులో పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఇసుక రవాణాపై సమాచారం అందడంతో పోలీసు సిబ్బంది నిన్న రాత్రి వాగులోకి వెళ్లారు. పోలీసులను గమనించిన ఇసుక మాఫియా కర్రలు, రాళ్లతో దాడికి దిగింది.

ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అనంతరం ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నవారు వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు ఐదు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు.