Twitter: కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో విషాదం.. ఫొటోలు ట్వీట్ చేసిన అరగంటకే యువ వైద్యురాలి మృతి

  • రెండు రోజుల క్రితం విరిగిపడిన కొండచరియలు
  • జైపూర్‌కు చెందిన యువ వైద్యురాలి మృతి
  • ప్రయాణిస్తున్న వాహనంపై బండరాళ్లు పడడంతో ఘటన
Himachal pradesh landslides incident young doctor dead

హిమాచల‌్‌ప్రదేశ్‌లోని కిన్నౌర జిల్లా సాంగ్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో విషాదం వెలుగు చూసింది. ఈ ఘటనలో మరణించిన 9 మందిలో రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన దీపాశర్మ (34) కూడా ఉన్నారు. ఆయుర్వేద వైద్యురాలైన ఆమె తానక్కడ ఉన్నట్టు ఫొటోలను ట్వీట్ చేసిన అరగంటకే ఈ దుర్ఘటనలో మృతి చెందారు.

మధ్యాహ్నం 12.59 గంటలకు ఐటీబీపీ చెక్‌పోస్టు వద్ద దిగిన చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్టచివరి పాయింటు వద్ద నేనిప్పుడు నిల్చుని ఉన్నాను. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా ఆక్రమిత టిబెట్‌తో మనకు సరిహద్దు ఉంది’’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ తగిలించారు.

ఆ తర్వాత 1.25 గంటలకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై కొండచరియలు విరిగి పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కాగా, వైద్యురాలైన దీపాశర్మకు ట్రావెలింగ్, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం ఇష్టమైన అంశాలని తెలుస్తోంది. మహిళా సాధికారత కోసం ఓ స్వచ్ఛంద సంస్థతోనూ కలిసి పనిచేస్తున్నారు.

More Telugu News