తెలంగాణ దళిత బంధు కేవలం ఓ కార్యక్రమం కాదు... ఉద్యమం: సీఎం కేసీఆర్

26-07-2021 Mon 18:00
  • తెలంగాణలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం
  • హుజూరాబాద్ దళిత నేతలతో అవగాహన సదస్సు
  • దళితులందరికీ అవకాశాలు లభిస్తాయన్న సీఎం కేసీఆర్
  • దళిత బంధు అభివృద్ధికి బాటలు వేస్తుందని వెల్లడి
CM KCR says Telangana Dalit Bandhu is a movement

టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా తెలంగాణ దళిత బంధు కార్యక్రమం తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ప్రథమంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత నేతలతో ఈ కార్యక్రమంపై నేడు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ దళిత బంధు కేవలం ఓ కార్యక్రమం కాదని, ఇది ఒక ఉద్యమం అని స్పష్టం చేశారు. ఎవరైతే అవకాశం లేక, సహకారం అందక బాధపడుతున్నారో అటువంటి వర్గాలన్నింటికి దళిత బంధు బాటలు పరుస్తుందని అన్నారు.

నాడు ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి విజయాన్ని అందించిందని గుర్తుచేశారు. అంబేద్కర్ కృషి వల్ల దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందని ఉద్ఘాటించారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్ షాపులు తదితర ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

పవర్ టిల్లర్లు, హార్వెస్టర్లు, వరి నాటు యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ల పెంపకం, టెంట్ హౌస్, డెయిరీ పరిశ్రమ, నూనె, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల పరిశ్రమ, హోటళ్లు, స్టీల్, సిమెంట్ తదితర భవన నిర్మాణ మెటీరియల్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్ ఫోన్ దుకాణాలు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, వస్త్ర దుకాణాలు, ఫర్నీచర్ షాపులు వంటి పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి వారి ఇష్టాన్ని బట్టి దళిత బంధు పథకంద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.

దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థికసాయానికి అదనంగా దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వమే స్వయంగా అండగా ఉన్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఇక, ఇవాళ్టి సదస్సులో పాల్గొన్నవారు హుజూరాబాద్ లో విజయం సాధించి, రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.