Revanth Reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

  • భారీ వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది
  • ఎకరాకు రూ. 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి
  • రూ. లక్ష రుణమాఫీ హామీని తక్షణమే నెరవేర్చాలి
Revanth Reddy writes letter to KCR

గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవడానికి ఎకరాకు రూ. 15 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని... విత్తనాలు, ఎరువులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. లక్ష రైతు రుణమాఫీని తక్షణమే నెరవేర్చాలని... రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకాన్ని కాని, సవరించిన వాతావరణ పంటల బీమా పథకాన్ని కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని... దీనికి తోడు డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులు కూడా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రేవంత్ అన్నారు. కూలీ రేట్లు పెరగడంతో వ్యవసాయ పెట్టుబడులు మరింత ఎక్కువయ్యాయని చెప్పారు.

More Telugu News