ఇంగ్లండ్ టూర్ కి సూర్యకుమార్, పృథ్వీ షా: బీసీసీఐ

26-07-2021 Mon 13:40
  • అప్పుడే గాయాలబారిన పడిన ముగ్గురు ఆటగాళ్లు
  • రీప్లేస్ మెంట్ కోరిన టీమ్ మేనేజ్ మెంట్
  • ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సూర్యకుమార్, పృథ్వీ షా
Surya Kumar Yadav and Prithvi Shah to go for England tour
ఇంగ్లంలో ఉన్న టీమిండియా జట్టు గాయాలతో సతమతమవుతోంది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే ముగ్గురు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. వార్మప్ మ్యాచ్ లో ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బైగా ఎంపికైన పేసర్ అవేశ్ ఖాన్ లు గాయపడ్డారు. వీరు కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలపడంతో... టీమ్ మేనేజ్ మెంట్ రీప్లేస్ మెంట్ కోరింది.

దీంతో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో ఇద్దరు ఆటగాళ్లను ఇంగ్లండ్ కు పంపాలని నిర్ణయించింది. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ శ్రీలంక టూర్ లో ఉన్నారు.

వీరిద్దరిలో పృథ్వీ షాకి ఇప్పటికే టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కు మాత్రం ఇదే తొలి టెస్టు సిరీస్ కానుంది. సూర్యకుమార్ ఈ ఏడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి వన్డే సిరీస్ లోనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.