KCR: దళితబంధు ఒక ఉద్యమం.. హుజూరాబాద్ లో ఈ పథకాన్ని విజయవంతం చేయాలి: కేసీఆర్

  • హుజూరాబాద్ దళిత ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం
  • దళితబంధుపై అవగాహన సదస్సు నిర్వహించిన కేసీఆర్
  • హుజూరాబాద్ విజయంపై.. యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంటుంది
KCR wareness meeting on Dalit Bandhu

దళితబంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత ప్రతినిధులతో కేసీఆర్ ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దళితబంధు లక్ష్యాలు, కార్యాచరణ, అమలు చేసే విధానం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, 412 మంది దళిత ప్రతినిధులు హాజరయ్యారు.

తొలుత ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నామని... ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేస్తే, దాని ప్రభావం యావత్ రాష్ట్రంపై ఉంటుందని కేసీఆర్ చెప్పారు. హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. దళితబంధు అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని... ఒక ఉద్యమమని చెప్పారు.

ఈ పథకం విజయవంతం కావడానికి అందరూ దృఢమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మనందరిలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని చెప్పారు. పరస్పర అనుబంధాలను పెంచుకుంటేనే విజయానికి బాటలు పడతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక్కడితో ప్రారంభమై, భారతీయ రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, విజయం సాధించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రతి విషయంలో వ్యతిరేక శక్తులు ఉంటాయని... అయితే, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రయాణాన్ని కొనసాగించినప్పుడే విజయం సాధ్యమవుతుందని అన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందని కేసీఆర్ చెప్పారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్ స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు.

More Telugu News