రామప్ప గుడికి యునెస్కో గుర్తింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్

25-07-2021 Sun 20:14
  • తెలంగాణలోని రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
  • ఆనందం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
  • కాకతీయ శిల్పకళా నైపుణ్యం ప్రత్యేకమైనదని వెల్లడి
  • ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు
CM KCR extends gratitude to Union Govt after UNESCO announced Rammappa Temple as world heritage site

తెలంగాణలోని రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపికవడం పట్ల సీఎం కేసీఆర్ స్పందించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైనదని కొనియాడారు. కాకతీయ రాజులు సృజనశీలురని, వారి కాలంలో నిర్మితమైన ఆలయాలు చెబుతున్నాయని వివరించారు.

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప గుడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కృషి చేశారంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. అటు, యునెస్కో సమావేశంలో భారత్ కు మద్దతు పలికిన ఇతర సభ్య దేశాలకు కూడా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.