చంద్రబాబు శవరాజకీయాలను ఏలూరు ప్రజలు తిప్పికొట్టారు: మంత్రి ఆళ్ల నాని

25-07-2021 Sun 19:19
  • ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం
  • ఇవాళ ఓట్ల లెక్కింపు
  • 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలుచుకున్న వైసీపీ
  • చంద్రబాబుపై ఆళ్ల నాని ధ్వజం
Alla Nani slams Chandrababu after YCP victory in Eluru Corporation Elections

ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించడం పట్ల ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల విజయం ఓ నిదర్శనం అని ఆళ్ల నాని వెల్లడించారు.

ఇవాళ 47 డివిజన్లకు ఓట్ల లెక్కింపు నిర్వహించగా, వైసీపీ 44 డివిజన్లను చేజిక్కించుకుంది. టీడీపీకి 3 డివిజన్లలో విజయం లభించింది. అంతకుముందు 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలో, మొత్తం 50 డివిజన్లలో 47 డివిజన్లను కైవసం చేసుకున్న వైసీపీ ఏలూరు కార్పొరేషన్ పీఠాన్ని అధిష్ఠించింది.

దీనిపై ఆళ్ల నాని మాట్లాడుతూ, చంద్రబాబు శవ రాజకీయాలను ఏలూరు ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఏలూరు నగర పాలక సంస్థ ఫలితాలను అడ్డుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించినా, ప్రజల అండదండలు, దేవుడి ఆశీస్సులు తమకు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ఇకనైనా మారాలని, లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు జరిగినా ఇలాంటి ఫలితాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.