Mann Ki Baat: తిరుప‌తి యువ‌కుడిపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

  • మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన మోదీ
  • సాయి ప్ర‌ణీత్ సేవ‌ల‌ను ప్ర‌స్తావించిన ప్ర‌ధాని
  • సామాజిక మాధ్య‌మాల్లో రైతుల‌కు సాయి సేవ‌లు
  • ఏపీ వెదర్ మ‌న్ పేరుతో వాతావ‌ర‌ణ స‌మాచారం  
modi praises sai on mann ki baat

తిరుప‌తికి చెందిన సాయి ప్ర‌ణీత్ అనే యువ‌కుడిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. ఈ రోజు మోదీ మ‌న్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. సామాజిక మాధ్య‌మాల్లో రైతుల‌కు ఏపీ వెదర్ మ‌న్ పేరుతో వాతావ‌ర‌ణ స‌మాచారం అందిస్తూ సాయి ప్ర‌ణీత్ మంచి పని చేస్తున్నార‌ని అన్నారు. బెంగ‌ళూరులో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తోన్న సాయి ప్ర‌ణీత్ తాను రైతుల‌కు అందిస్తోన్న సేవ‌ల‌కు గాను ఐక్య‌రాజ్య‌స‌మితి, భార‌త వాతావ‌ర‌ణ శాఖ నుంచి కూడా గ‌తంలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆయ‌న సేవ‌ల‌ను మ‌న్ కీ బాత్‌లో మోదీ ప్ర‌స్తావించారు.

అలాగే, చండీగ‌ఢ్‌కు చెందిన 29 ఏళ్ల సంజ‌య్ రాణాను కూడా మోదీ ప్ర‌శంసించారు. ఆ యువ‌కుడు ఫుడ్ స్టాల్ ను నిర్వ‌హిస్తుంటాడ‌ని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భ‌తూర్ అనే వంట‌కాన్ని అమ్ముతుంటాడ‌ని మోదీ అన్నారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయ‌న ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడారు.

మ‌రోవైపు, త‌మిళ‌నాడులోని నీల‌గిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మ‌హిళ అమ్‌బ‌ర్క్స్ ప్రాజెక్ట్ చేప‌ట్టి సేవ‌లందిస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌శంసించారు. కొండ ప్రాంతాల ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు వెళ్లేందుకు ప‌డుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని వారి కోసం ఆమె ఉచితంగా ర‌వాణా స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నార‌ని చెప్పారు. త‌న స‌హ‌చ‌ర ఉద్యోగుల వ‌ద్ద విరాళాలు సేక‌రించి ఆమె ఈ సేవ‌లు కొన‌సాగిస్తున్నార‌ని మోదీ వివ‌రించారు. ఆమె మొత్తం ఆరు అమ్‌బ‌ర్క్స్ (ప్ర‌త్యేక‌ ఆటోల ద్వారా వైద్య స‌దుపాయం) స‌ర్వీసులు న‌డిస్తున్నార‌ని కొనియాడారు.

కాగా, పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రుపుకునే స‌మ‌యంలో క‌రోనా ఇంకా తొల‌గిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు సూచించారు. క‌రోనా ఇంకా మ‌న మ‌ధ్యే ఉంద‌ని, కొవిడ్ నియంత్ర‌ణ నియ‌మాల‌ను మ‌ర్చిపోకూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News